Wednesday, July 1, 2009

"అసలు మంత్రాలుఅనే విషయంపై చాలామందికి
ప్రాధమిక పరిజ్ఞానం కూడా ఉండదు." అయినా, మంత్రాలను పాతకాలపు
అనాగరిక విషయాలుగా పరిగణిస్తూ విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు.
'మననాత్ త్రాయతే ఇతి మంత్రః' అన్నారు. మననం చేయుటవలన రక్షించునది అని అర్ధం.
ఆయా దేవతలకు అక్షర రూపం ఆయా మంత్రమైతే, రేఖారూపం యంత్రం.
మంత్ర, యంత్రాదులతో చేసే సాధనా పద్ధతిని తంత్రమంటారు.
ఏ మంత్రమైనా ముందుగా గురువు దగ్గర ఉపదేశం పొందాల్సి ఉంటుంది.
గురువు చెప్పినట్లుగా పురశ్చరణ సంఖ్య పాటించాల్సి ఉంటుంది.
మంత్రశాస్త్రాలలో ప్రతి మంత్రానికి పురశ్చరణ సంఖ్య నిర్ధారించారు.
ఆ ప్రకారంగా మంత్ర పురశ్చరణ చేయాలి. అలానే, పురశ్చరణ సంఖ్య కూడా
ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఉంటుంది. సాథారణంగా ఒక మండలం పాటు
ఈ పురశ్చరణ పూర్తి చేయాలి.పురశ్చరణ అయిదు విభాగాలుగా మంత్రశాస్త్రంలో
ప్రకటించారు. అవి జపం, హోమం, తర్పణం, మార్జనం, సమారాధనం.
ఉదాహరణకి జప సంఖ్య ఒక లక్ష అనుకుంటే, అందులో పదో వంతు
అనగా పదివేలు హోమం, పదివేల హోమంలో పదోవంతు అనగా వెయ్యి తర్పణం,
వెయ్యి తర్పణంలో పదో వంతు అనగా వంద మార్జనం, వంద మార్జనంలో పదో వంతు
అనగా పదిమందికి సమారాధన చేయాలి

కఠోరదీక్షతో, ఏకభుక్తంగా, భూశయన తదితర నియమాలు పాటిస్తూ చేసే మంత్రసాధన
ఫలించకపోవటమంటూ ఉండదు భక్తిలేని భజనలానో, ఏకాగ్రత లేకుండా చేసే సాధన ఫలించదు.
దానికి మంత్రాన్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు. నాకు తెలిసీ ఈరోజుల్లో అంతటి కఠోరసాధన చేసిన,
చేస్తున్నవారు ఉన్నారు. ఇప్పటి ఒక పీఠాధిపతి తన పూర్వాశ్రమంలో ఉపదేశం పొందిన
ప్రతిమంత్రాన్ని సిద్ధింప చేసుకున్నారు. ఈరోజు సూర్యాస్తమయం నుంచి మరునాటి సూర్యోదయం
దాకా, శీర్షాసనం వేసి మరీ ఆయన సాధన చేసేవారు.

మరి మనలాంటి సాధారణ వ్యక్తులో!! అగరుబత్తి వెలిగించి, దేవతా పటాలకు తిప్పుతూ
చేసే శుక్లాంబరధరాలతోనూ, రోజుకో పదిసార్లు చదివే మంత్రాలతోనూ పనులు జరగటంలేదని
వాపోవటంలో అర్ధం లేదు. మనం ఎన్ని వందలసార్లు అ, ఆ, లు దిద్దితే ఈనాడు తెలుగు వ్రాసి, చదవగలుగుతున్నాము? అందులో పదోవంతైనా పడ్డ కష్టాన్ని సాధనలో పెడితే మంత్రమెందుకు సిద్ధించదు?

మంత్రసిద్ధి అనేది సినిమాలలో చూపించే విధంగా ఆషామాషీ వ్యవహారం కాదు.
కఠోరసాధకుడైన విశ్వామిత్రుని వంటి బ్రహ్మర్షే మూడు నాలుగుసార్లు కఠోర తపస్సు
చేయాల్సి వచ్చింది బ్రహ్మర్షిగా సిద్ధి పొందటానికి. మొదటిసారి చేసిన తపస్సు
మేనక వ్యవహారంతో నష్టపోయాడు. రెండోసారి, రంభకు శాపం ఇచ్చి తపస్సును వ్యర్ధం
చేసుకున్నాడు. అయినా, పట్టు వదలక మళ్ళీ సాధించాడు. ఈరోజుల్లో అంతటి దీక్షా పరులు,
జనబాహుళ్యానికి తెలియని సాధకులు చాలామందే ఉన్నారు.

ఏదేమైనా, ఒక విషయాన్ని ఖండించాలన్నా, తప్పు అని నిరూపించాలన్నా
ప్రయోగం చేసి తీరాలి. అదేమీ లేకుండానే, ఇవన్నీ బూటకం, మంత్రాలకు చింతకాయలేమీ
రాలవు అని ఓ అభిప్రాయాన్ని ప్రకటించేస్తే ఎలా?

Friday, May 8, 2009